అక్రమమన్నారు.. ఆలయమేల?





అయోధ్య తీర్పుపై తొలి రివ్యూ పిటిషన్
తొలి లిటిగెంట్ వారసుడి దాఖలు
14 అంశాలతో సమీక్షకు డిమాండ్


న్యూఢిల్లీ : అయోధ్య తీర్పుపై సోమవారం తొలి రివ్యూ పిటిషన్ దాఖలు అయ్యింది. అయోధ్య భూ వివాదంపై మొట్టమొదటి కక్షిదారుల వారసుడు మౌలానా సయ్యద్ అస్హద్ రషీదీ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. అయోధ్య వివాదాస్పద స్థలిలో రామాలయ నిర్మాణానికి వీలుగా అత్యున్నత న్యాయస్థానం గత నెలలో తీర్పువెలువరించింది. దీనిని సమీక్షించాలని, తమకు సరైన న్యాయం జరిపించాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌లో 14 అంశాలను చేర్చారు. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులోని కొన్ని అంశాలను రషీదీ ప్రస్తావించారు. హిందూ పక్షాలు జరిపిన పలు అక్రమాలలో తాము కొన్నింటిని గుర్తించామని తీర్పులో పేర్కొన్న విషయాన్ని పిటిషనర్ తెలియచేసుకున్నారు. పలు చట్టవ్యతిరేక చర్యల ప్రాతిపదికనే స్థలం హక్కులను కోరిన పక్షానికే అనుకూల తీర్పు ఇచ్చారని, ఇది వారి చట్టవ్యతిరేక చర్యలకు ఆమోదం తెలియచేయడం కాదా? అని రషీదీ ప్రశ్నించారు.


అక్రమానికి క్లీన్‌చిట్ ఇవ్వడం సముచితమా? అని ఆవేదన వ్యక్తం చేశారు. తాము మొత్తం తీర్పును సవాలు చేయడం లేదని, కేవలం 14 అంశాల ప్రాతిపదికనే తీర్పు సమీక్షకు డిమాండ్ చేస్తున్నామని పిటిషనర్ తెలిపారు. ఈ సమస్య సున్నితమైనదనే విషయం తెలుసునని, అయితే దీనికి సరైన విధంగా ముగింపు పలకాల్సి ఉంటుందన్నారు. అయితే ఎటువంటి అంశానికి అయినా సరైన న్యాయ పరిష్కారం దక్కితేనే శాంతి నెలకొంటుందని తెలిపారు. అప్పటి ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. రామ్ లల్లా విరాజ్‌మాన్‌కే స్థలం చెందుతుందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఒక ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయాలని, దీని ద్వారా రామాలయ నిర్మాణ పనులు చేపట్టవచ్చునని పేర్కొంది.


ఇక ముస్లిం పక్షాలకు అన్యాయం జరగకుండా ప్రత్యామ్నాయంగా ఐదెకరాల స్థలం కేటాయించాలని ఆదేశించింది. అక్కడ వారు మసీదు నిర్మించుకోవచ్చునని తెలిపింది. ఈ భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డుకు అప్పగించాలని స్పష్టం చేసింది. తీర్పును తాము సవాలు చేయడం లేదని వక్ఫ్‌బోర్డు పేర్కొంది. వేరే స్థలం తీసుకునే విషయంపై స్పష్టతను ఇవ్వలేదు. అయితే ముస్లిం పర్సనల్ లా బోర్డు వారు తీర్పు సమీక్షకు వెళ్లుతామని, ఈ నెల 9వ తేదీలోగానే పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు. దేశంలోని 99 శాతం మంది ముస్లింలు తీర్పు పట్ల వ్యతిరేకతతో ఉన్నారని, సమీక్ష కోరుతున్నారని పర్సనల్ లా బోర్డు వెల్లడించింది. ఇప్పుడు తీర్పుపై తొలి రివ్యూ పిటిషన్ దాఖలు కావడం, రాబోయే రోజులలో మరిన్ని పిటిషన్లు రానుండటంతో సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాల్సి ఉంది.


దేవతా మూర్తికి స్థలం కట్టబెడుతారా?
అక్కడున్న దేవతా విగ్రహాన్ని పరిగణనలోకి తీసుకుని, స్థలంపై భౌతిక వాస్తవిక ఆధీనత లేని స్థితిలో వారిని యాజమాన్యానికి అర్హులుగా గుర్తిస్తారా? న్యాయస్థానాలు చారిత్రక తప్పిదాలను సరిదిద్దే బాధ్యత తీసుకోవచ్చా? చారిత్రక అంశాలను నిజంగా జరిగినవే అని నిర్థారించుకోవచ్చా? మరి ఈ వ్యాజ్యానికి సంబంధించి ఆర్కియలాజికల్ వారి నిర్థారణలను తీర్పునకు ప్రాతిపదికగా తీసుకోవచ్చా? అని పలు ప్రశ్నలను పిటిషనర్ ప్రశ్నించారు.