దిశాపై అసభ్య పోస్టులు చేసిన యువకుడు అరెస్టు..


హైదరాబాద్: షాద్ నగర్ దిశా హత్యోదంతంపై దేశవ్యాప్తంగా ప్రజాసంఘాలు, విద్యార్థులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఇలా అందరూ తీవ్రంగా ఖండిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, కొందరు ఆకతాయిలు మాత్రం కనీస మానవత్వం మరిచి ఇష్టానుసారంగా దిశాపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారు. దీంతో బాధితురాలు దిశాపై ఎవరైనా అభ్యంతరకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని నగర పోలీసులు హెచ్చరించారు. బాధితురాలు ఫొటోలను కూడా వాడకూడదని స్పష్టం చేశారు. అయినా పోలీసుల మాటలు లెక్కచేయలేదు ఓ యువకుడు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్‌కు చెందిన చవన్ శ్రీరామ్(22) అనే యువకుడు దిశాపై ఫేస్‌బుక్‌లో అసభ్య పోస్టులు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి వాటికి పాల్పడితే కఠన చర్యలు తీసుకుంటామని, సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టుల పట్ల పటిష్ట నిఘా పెట్టామని, ఎవరైన హద్దు మీరితే జైలుకెళ్తారని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.