ఫడ్నవీస్‌పై బిజెపి ఎంపి సంచలన వ్యాఖ్యలు


న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే కర్నాటకకు చెందిన బిజెపి ఎంపి అనంతకుమార్ హెగ్డే తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో తమకు సంఖ్యాబలం లేదని తెలిసి కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టడానికి అసలు కారణాన్ని హెగ్డే బయటపెట్టారు. మహారాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం విడుదల చేసిన రూ. 40,000 కోట్లను తిప్పి పంపించేందుకే ఆయన కేవలం 80 గంటలు మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేశారని హెగ్డే వెల్లడించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బలం లేదని తెలిసీ బిజెపి మహారాష్ట్రలో ఎందుకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసి వచ్చిందని అందరూ తనను అడుగుతున్నారని తెలియచేస్తూ అందుకే తాను ఈ వివరణ ఇవ్వవలసి వచ్చిందని ఆయన అన్నారు. కేంద్రం నుంచి వచ్చిన రూ.40,000 కోట్లు అక్కడ అందుబాటులో ఉన్నాయి. కాంగ్రెస్, ఎన్‌సిపి, శివసేన ప్రభుత్వం ఏర్పడితే అభివృద్ధి కోసం ఉద్దేశించిన ఆ నిధులు దుర్వినియోగం అవుతాయని ఆయనకు(ఫడ్నవీస్) తెలుసు. అందుకే ఒక డ్రామా జరగాలని నిర్ణయించారు. ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యారు. 15 గంటల్లోనే ఆ రూ. 40,000 కోట్లను కేంద్రానికి వాపసు పంపించారు అని హెగ్డే తెలిపారు.